Sunday, September 12, 2010

న్యూయార్క్ లోని టెన్నిస్ సెంటర్ సందర్శన !!

మా అమ్మాయి యషు ని తీసుకుని న్యూయార్క్ లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్ డోర్ టెన్నిస్ స్టేడియం [23,200 సీట్స్] అయిన "ఆర్థర్ అష్" స్టేడియం లో గత నెల ఆగస్ట్ 28 జరిగిన బాలల టెన్నిస్ దినోత్సవాలకు వెళ్ళటం జరిగింది.స్టేడియం కి 2 కిమీ దూరం లో ఎయిర్పోర్ట్ హొటెల్ లో రూం బుక్ చేసుకుని ట్రాఫిక్ అవరోధాలు దాటుకుంటూ క్రితం రోజు రాత్రి 9 గం కే న్యూయార్క్ చేరుకున్నాం. ఉదయానే లేచి 10 గంటలకల్లా బిల్లీ జీన్ కింగ్ టెన్నిస్ సెంటర్ చేరుకున్నాం. మాజీ మరియు ప్రస్తుత క్రీడాకారుల చిత్ర పటాలతో స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఆహుతులకు స్వాగతం పలికింది. ప్రతి చిత్రం లోను వారి వారి గత చరిత్ర కూడ ముద్రించడంతో తెలియని వారికి తెలుసుకొనే అవకాశం లభించింది. పిల్లలకు టెన్నిస్ క్రీడ పై ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా ఫేస్ పెయింట్లు, కార్టూన్ కారక్టర్లైన స్పంజి బాప్,డోరా లాంటి క్లౌన్స్ తో ఫోటొ సెషన్స్ వంటివి కూడా ఉండటంతో పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..యషుతో పాటు మేము కూడ మంచి సమయం గడిపాము. కిం క్లిస్టెర్, ఫెదరర్, నాడాల్, రాడిక్, జకోవిచ్ తదితరులంతా వచ్చి మరుసటి రోజు నుంచే ప్రారంభమయ్యే యూయెస్ ఓపెన్ పోటీలకి నెట్ ప్రాక్తీస్ చేస్తూంటే ప్రత్యక్షంగా చూడగలిగాం. అంతే కాకుండా డిస్ని రాక్ స్టార్స్ అయిన జోనాస్ బ్రదర్స్ సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేసారు. వారి సంగీతం అంటే అమెరికా పిల్లలు ఎంతగా చెవి కోసుకుంటారో వారి కేరింతలు చూస్తుంటే తెలిసింది....
స్టేడియం లో కలియ తిరుగుతుండగా అసలు ఇంత పెద్ద స్టేడియానికి ఆర్థర్ పేరు పెట్టి ఆయన పేరు మీదే ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారు ? 1881 సం లో స్థాపించబడి 17 భౌగోళిక భాగాలతో 700,000 మంది వ్యక్తిగత సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ సంస్థ గా అలరారుతూ ఆర్థర్ అష్, లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్, గ్రాండ్ స్టాండ్ స్తేడియంలతో కలుపుకుని మొత్తం 18 స్టేడియంలు ఉన్న సెంటర్ కి "బిల్లీ జీన్ కింగ్" పేరే ఎందుకు పెట్టాల్సివచ్చింది? ఎవరీ ఆర్థర్ అష్ & బిల్లీ జీన్ కింగ్లు? ఇంటికి రాగానే అంతర్జాలం లో కెళ్ళి పరిశొధించగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి.

ఆర్థర్ ఆష్:

యూఎస్ ఓపెన్ చాంపియన్ షిప్ గెలుచుకున్న మొట్ట మొదటి నల్ల జాతీయుడు..అంతే కాకుండా వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక నల్లజాతీయుడు కూడా ఇతనే కావటం విశేషం.
బిల్లీ జీన్ కింగ్:
మహిళా టెన్నిస్ ప్రపంచంలో ఉక్కుమహిళ గా పేరుతెచ్చుకుంది ఈమె...1973 హ్యూస్టన్ లో వింబుల్డన్ విజేతైన బాబి రిగ్గ్స్ అనే ఆయనతొ తలపడి వరుసగా మూడు సెట్ల విజయం సాధించి "బాటిల్ ఆఫ్ సెక్సెస్" టైటిల్ ని కైవసం చేసుకున్న "షీరో". అంతేకాదు, ఒకే సీజన్ లో అత్యధిక పారితోషికం [$100,000] తీసుకున్న మొట్ట మొదటి మహిళా ఆథ్లెట్ కూడా ఈమెనే. ప్రప్రధమ మహిళ టెన్నిస్ అసోసియేషన్ ని స్థాపించి దానికి అధ్యక్షురాలిగా చాలా కాలం పనిచేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రనే ఉంది ఈమెకు.
వీరి ఇద్దరిగురించీ చదివిన తరువాత స్టేడియంకీ & టెన్నిస్ సెంటర్ కీ వారి పేర్లు పెట్టటం సబబే అనిపించింది.
అవకాశం ఉంటే, ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒక్కసారైనా సందర్శించవలసిన స్టేడియం ఇది.
చాయా చిత్రాలు ఇక్కడ:
http://picasaweb.google.com/Delawareandhra/USOpenTennisKidsDayNewyork#

No comments: